బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులు ఈ రోజు స్థానిక సర్పంచ్ శ్రీ ఎడ్ల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ కోసం రూ.206 కోట్ల నిధులు విడుదల కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే గారితో కలిసి గ్రామస్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. గతంలో ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణకు అవసరమైన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థుల సమస్యను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రూ.206 కోట్ల ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ నిధులను విడుదల చేశారని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి భువనగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయితే భువనగిరి, వలిగొండ, నకిరేకల్, రామన్నపేట, తుంగతుర్తి ప్రాంతాల రైతులకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మూసీ మురుగు నీటిపై ఆధారపడకుండా గోదావరి జలాలతో రైతులు సాగు చేసుకునేలా బస్వాపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి హయాంలో బస్వాపూర్ రిజర్వాయర్‌లో ఐదు టీఎంసీల నీటిని నింపి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కెనాల్ ద్వారా దిగువ ప్రాంతాలకు నీరు చేరేందుకు నేషనల్ హైవే వద్ద అవసరమైన పనులు చేపట్టామని, బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.బస్వాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా-బాబురావు, ఆత్మ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు,PACS చైర్మన్లు సతీష్ పవన్, శ్యామ్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, భువనగిరి నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులకు 206 కోట్ల ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ నిధులను విడుదల
Popular Categories


