నవపక్షం, బాలానగర్ ప్రతినిధి :
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
భారతదేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. దేశంపై శత్రుదేశాలు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తోందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలలను నిజం చేయడంతో పాటు సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
చదువుతో పాటు విద్యార్థులకు ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని డీకే అరుణ అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షులు గోవింద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


