నవపక్షం, చౌటుప్పల్ | సెప్టెంబర్ 8 :
చౌటుప్పల్: ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత శ్రీ కేసీఆర్ గారి నివాసానికి బయలుదేరిన అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సూర్వి మల్లేష్ గౌడ్‌తో పాటు చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన BRS నాయకులు ఉదారి రాకేష్, మహమ్మద్ అత్తులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా సూర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ గారి నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చినప్పటికీ, వారిపై ముందస్తు చర్యలు తీసుకోకుండా, తమను మాత్రమే అదుపులోకి తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమానంగా చట్టాన్ని అమలు చేసే విధానమా అని ప్రశ్నించారు.
పోలీసులు రాజకీయ పక్షపాతానికి అతీతంగా వ్యవహరిస్తూ ప్రజలకు రక్షణగా పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలను, నిరసనను వ్యక్తం చేసే హక్కును ప్రభుత్వం, పోలీసులు పరిరక్షించాలని అన్నారు.
ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే చర్యలకు చట్టబద్ధమైన కారణాలు, విధివిధానాలు పాటించాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.


