నవపక్షం, ఉయ్యూరు ప్రతినిధి, ఆగస్టు 10: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలని తెలుగుదేశం పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఉయ్యూరులోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో సోమవారం ఆటో వర్కర్స్, బ్యాటరీస్, టైర్స్ రంగాలకు చెందిన యూనియన్ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, టూ వీలర్ మెకానిక్స్‌తో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్మికులంతా కవి శ్రీశ్రీ చెప్పినట్లు “శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు” అని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి, ఆయిల్, బురద, మట్టితో కలిసిపోయి తమ చేతులకు, ఒంటికి, దుస్తులకు మరకలు అంటుకున్నా, ప్రజల వాహనాలను సక్రమంగా పనిచేసేలా మరమ్మతులు చేస్తూ సేవలందిస్తున్నారని కొనియాడారు.
ఉయ్యూరులోనే సుమారు 100 మంది టూ వీలర్ మెకానిక్స్, ఆటోమొబైల్ రంగ కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతోందని, పాత సాంకేతికతకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.
ఈ మార్పులకు అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుని, నూతన సాంకేతికతపై శిక్షణ పొందాలని ఆయన సూచించారు. వారి వృత్తిపరమైన అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ వారి సోదరుడిగా అండగా ఉంటానని రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు.
అనంతరం యూనియన్ నాయకులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ను గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఫజలుల్ మజీద్, బైక్ మెకానిక్ యూనియన్ అధ్యక్షులు అక్బర్ బాషా, యూనియన్ కార్యదర్శి అబ్దుల్ మాబూద్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.






