నవపక్షం, జోగిపేట, ఆందోల్: జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. రమేశ్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ఈ నెల 5వ తేదీన నైట్ డ్యూటీకి డాక్టర్ కె. రమేశ్ స్వయంగా హాజరు కాకుండా, తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని విధుల్లో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఈ విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ తక్షణమే విచారణ జరిపించాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్. చొంగ్తును ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన విచారణలో డాక్టర్ కె. రమేశ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని విచారణ కమిటీ నిర్ధారించింది.
దీంతో ప్రభుత్వం డాక్టర్ కె. రమేశ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, డాక్టర్ రమేశ్ స్థానంలో నైట్ డ్యూటీ నిర్వహించిన ప్రైవేట్ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆ వ్యక్తి పూర్తి వివరాలను సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.






