నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 9: విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన సోదరులు తమ సంప్రదాయ థింసా నృత్యంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గిరిజన వనదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ సమాజం విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా పరిరక్షిస్తూ వస్తోందని, ఇది రాష్ట్రానికి ఎంతో విలువైన సాంస్కృతిక వారసత్వమని అన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.






