నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1:
మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన విత్తన గణపతిని ప్రముఖ నటి కళ్యాణికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు.
ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వినాయక చవితి అనంతరం విత్తన గణపతిని మట్టిలో నాటడం ద్వారా అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని పేర్కొన్నారు.
ప్రకృతిని కాపాడుతూ పర్యావరణహితంగా వినాయక చవితిని నిర్వహించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నటి కళ్యాణి విత్తన గణపతి కార్యక్రమాన్ని అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.


