నవపక్షం : రంగారెడ్డి బ్యూరో
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను బి.ఎన్.రెడ్డి నగర్‌లోని వినాయక హిల్స్ లార్డ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో పాఠశాల ఆవరణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఈ వేడుకలకు పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. వైస్ చైర్మన్ బెర్లూ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో అలంకరించిన బోనాలను తలపై మోసుకొచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. డప్పుల మోగింపు, జానపద గీతాల నడుమ సాగిన ఊరేగింపు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ సిద్ధాల బీరప్ప మాట్లాడుతూ, “మన తెలంగాణ పండుగలు, సంప్రదాయాలు పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియాలి. వాటి వెనక ఉన్న భక్తి, విలువలు, సంస్కృతిని అర్థం చేసుకుని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
వైస్ చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, తెలంగాణ సంస్కృతి పట్ల మరింత ప్రేమ, గౌరవం పెంపొందించాలని ఆకాంక్షించారు.
భక్తి, సంప్రదాయం, కళ, సంస్కృతి కలిసిన ఈ బోనాల సంబురాలు పాఠశాల మొత్తాన్ని తెలంగాణ జాతరగా మార్చాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.






